ఆడ,మగ సృష్టికి ప్రతిసృష్టి స్వరూపాలు. ఇది సహజం...సాధారణం. కానీ మగ వారే పిల్లల్ని కంటే అసాధారణమే కదూ! ఆ మధ్య కాలంలో ఓ అయ్య అమ్మ అయ్యాడు. అది లింగమార్పిడితో సాధ్యమైన అమ్మతనమే అనుకోండి.అందులో వింత లేదు. ఆధునిక కాలంలో సైన్స్ పురోగతి అని సరిపెట్టుకోవచ్చు. అందుకు భిన్నంగా ఓ మగజీవి పిల్లల్ని కనడం మాత్రం వింతల్లో కెల్లా వింత.ఆ జీవే సీహార్స్.ఇది గుర్రం కాదు. ఓ జల చరం.చేప జాతి జీవి.
చూడ చక్కని `గుర్రం`: సముద్ర జల చరమైన ఈ సీహార్స్ అసలు పేరు హిప్పో కెంపస్.ప్రాచీన గ్రీకు పదం నుంచి వచ్చిందా పేరు.హిప్పోస్ అంటే గుర్రమని కెంపస్ అంటే సముద్రమని ఆ గ్రీకు పదానికి అర్థం.సమ ఉష్ణోగ్రత కల్గిన సముద్రాల్లో ఈ చేపలు జీవిస్తాయి.ఇవి నిశ్చలంగా ఉండే సముద్రగర్భంలోనే ఉంటాయి. అక్కడ మొలిచిన గడ్డి, ఉప్పుకయ్యలు, పగడపు చిప్పలు, రావి చెట్టు జాతి మొక్కలు గల ప్రాంతంలో మనుగడ సాగిస్తుంటాయి.వీటిలో దాదాపు 47 రకాలు ఉన్నాయి. ఇందులో నాలుగు రకాలు ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లోని అట్లాంటిక్ సముద్రాల్లో నివసిస్తున్నాయి. నోవా స్కాషియా, ఉరుగ్వే, బ్రహ్మస్ ప్రాంతాల్లోనూ మరి కొన్ని రకాల సీహార్స్‌లు కనిపిస్తాయి. పసిపిక్ సముద్ర జలాల్లో వివిధ రకాల సీహార్స్‌ల ఉనికి ఉంది. వీటిలో మగవి కేవలం ఓ చదరపు మీటర్ ప్రాంతంలోనే తిరుగాడుతుంటాయి. ఆడవయితే 100 చదరపు మీటర్ల మేర ఈదులాడతాయి. ఇంతకు వీటి గమన వేగమెంతంటే కేవలం గంటకు 150 సెంటీమీటర్లేనట.
పిల్లల్ని కనే మేల్ సీహార్స్: మొసళ్ల మాదిరిగా పొడుచుకొచ్చిన ఎముకలతో ఈ సీహార్స్‌లు గమ్మతుగా కనిపిస్తాయి. తోక వంటి భాగం వీటికో అదనపు ఆకర్షణ.కాగా మగ సీహార్స్‌లకు కంగార్లకు ఉన్నట్లే సంచి వంటి భాగం కూడా అమరి ఉంటుంది. సంభోగ సమయంలో ఆడవి తమ అండాలను మగ సీహార్స్‌ల సంచిలో వదిలి పెడతాయి. ఇలా దాదాపు 1500 అండాలను మగ సీహార్స్‌లు తమ సంచిలో 10 నుంచి 45 రోజులు ఉంచుకుంటాయి. సముద్ర గర్భంలోనే గడ్డి, మొక్కలున్న ప్రాంతంలో ఆ అండాలను విడిచిపెడతాయి. ఆ తర్వాత వాటి వద్ద ప్రొలాక్టిన్ అనే తమ వీర్య కణాల్ని విసర్జిస్తాయి. అలా బాహ్యంగానే సహజసిద్ధ ఇంక్యుబేటర్‌ల్లో పిల్ల సీహార్స్‌లు ఊపిరిపోసుకుంటాయి. అంతటితో తల్లి+తండ్రి కూడా అయిన మేల్ సీహార్స్‌ల బాధ్యత తీరిపోతుంది. ఇక అప్పటి నుంచి పిల్లల్నిఇవి పట్టించుకోవు.
మందు-ముప్పు:ఈ సీహార్స్‌లతో పలు రకాల మందులు తయారవుతున్నాయి. ముఖ్యంగా వీటిపై చైనీయులకు మక్కువ ఎక్కువ. అదే వీటి ఉనికికే ఎసరు తెస్తోంది. పైగా వీటి సంచార పరిధిని బట్టి అక్వెరియాల్లో వీటి పెంపకం బహు సులభం. దాంతో చాలా మందికి ఇవి పెంపుడు జీవులయ్యాయి.అయితే అద్భుతమైన వీటి మనుగడపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఈ సీహార్స్‌ల అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 2004 నుంచి నిఘా తీవ్రతరమైంది. ఇండోనేసియా, జపాన్, నార్వే, దక్షిణ కొరియా తదితర దేశాలపైనే అన్ని దేశాలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.
No comments:
Post a Comment