కొందరు వ్యక్తులు..వారి పేర్లు,రూపాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనే ఉండదు. వారు కనిపించినా, వినిపించినా జనసామాన్యం ఉర్రూతలూగిపోతుంది. వారి చరిత్ర,గొప్పతనం వివరాలు అనేక మందిలో గిర్రున తిరిగి గుర్తొచ్చేస్తాయి. అత్యంత ప్రభావశీలురైన సెలబ్రెటిలే వారు. అటువంటి ప్రత్యేక వ్యక్తుల్ని ముమ్మూర్తులా పోలిన మైనపు బొమ్మల కొలువే ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక స్థలం టుస్సాడ్ మ్యూజియం. లండన్‌లో బెకెర్ స్ట్రీట్‌లో నెలకొందిది. దీన్ని రూపొందించింది ఓ స్త్రీ.రోల్‌మోడల్ వ్యక్తుల నమూనాల రూపకల్పన ఆమె హాబీ.అలా మొదలై 1835లో టుస్సాడ్ మ్యూజియంగా పేరొందింది. ఈ మ్యూజియానికి అంకురార్పణ చేసిన మేరి టుస్సాడ్(అన్నా మరియా గ్రోషాల్జ్-ఫస్ట్ నేమ్)1761లో స్ట్రాస్‌బర్గ్, ఫ్రాన్స్‌లో జన్మించింది. 1777లో తొలిసారిగా వొల్టైర్ ప్రతిమను తీర్చిదిద్దింది. అదే సమయంలో జీన్‌జాక్వెస్ రొజేవ్, బ్రెంజిమన్ ఫ్రాంక్లిన్ ప్రతిమలకు వరుసగా రూపకల్పన చేసింది. ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఆ చరిత్రకు దర్పణం పట్టేలా అనేకమంది యోధులు, బాధితుల బొమ్మలను రూపొందించింది. ఫ్రాంకియస్ టుస్సాడ్‌ను 1795లో వివాహమాడిన ఆమె లండన్‌లో స్థిరపడింది.ఆ తర్వాత వందల మంది ప్రముఖుల రూపాలను బొమ్మలతో పునఃప్రతిష్ట చేసింది. 1850లో ఈ లేడీ టుస్సాడ్ మరణించే వరకు ఎందరో ప్రముఖుల ప్రతిమలు అలాగే జీవకళతో ఆమె చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి.
స్లీపింగ్ బ్యూటీ: టుస్సాడ్ మ్యూజియంలో మేడమ్ డుబెరి ప్రతిమ ప్రత్యేకమైనది.లూయిస్-15 సతీమణి అయిన బెరి నిద్రిస్తుండగా ఆమె ఎద ఊపిరి తీసుకుంటున్నట్లున్న భంగిమ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.నల్ల సూరీడు నెల్సన్ మండేలా,అడాల్ఫ్ హిల్టర్,చార్లిచాప్లిన్,మర్లిన్ మన్రో,ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్,ఎలిజబెత్ రాణి-2,పోప్‌జాన్‌పాల్-2,లేడీ గగా తదితర ప్రపంచ ప్రముఖుల ప్రతిమలన్నెంటితోనే అలరారుతోందీ టుస్సాడ్ మ్యూజియం.
విశ్వవ్యాప్తం:టుస్సాడ్ మ్యూజియం ఒక్క లండన్‌కే పరిమితం కాలేదు. ప్రపంచం నలుచెరగులా ఈ మ్యూజియానికి బ్రాంచ్‌లు వెలిశాయి. లాస్‌వెగాస్, హాలివుడ్( (కాలిఫోర్నియా), న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డి.సి., అమెస్టర్డమ్, బెర్లిన్, బ్లాక్‌పూల్, వియన్నా, బ్యాంకాక్, హాంగ్‌కాంగ్,షాంఘై, సిడ్నీల్లోనూ టుస్సాడ్ మ్యూజియాలు సందర్శకులకు కనువిందు కల్గిస్తున్నాయి. తాజాగా జకార్తాలో మరో బ్రాంచ్ జన సందర్శనకు సిద్ధమౌతోంది. 2012 జులై నాటికి అంకోల్ బీచ్ సిటీలో ఈ టుస్సాడ్ మ్యూజియం 3వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొలువుదీరనుంది. టుస్సాడ్ మ్యూజియాల్నింటిలో కల్లా అతి పెద్దదిగానూ ఈ బ్రాంచ్ రికార్డు నెలకొల్పనుండడం మరో విశేషం.ఇంతకూ టుస్సాడ్ మ్యూజియాల్లో ఒక్కో ప్రతిమకు ఎంత ఖర్చవుతుందంటే..అక్షరాల లక్షా 50వేల పౌండ్లు.నిపుణులైన శిల్పులు,ఇతర శరీర భాగాల తయారీదారులు ఒక్కో బొమ్మను తీర్చిదిద్దేందుకు దాదాపు నాలుగు నెలల సమయం తీసుకుంటారు.ఈ టుస్సాడ్‌లో ప్రతిమ నెలకొనడమే ఆయా వ్యక్తుల ఘనతకు గొప్ప నిదర్శనం.ఇప్పుడు ఆ ఛాన్స్ బాలివుడ్ మాజీ నంబర్ వన్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌కు వచ్చింది.మార్చిలో ఆమె ప్రతిమ టుస్సాడ్‌లో దర్శనమీయనుంది.ఇప్పటికే భారత్ తరఫున అమితాబ్,ఐశ్వర్యరాయ్,హృతిక్,సల్మాన్,షారుఖ్,కరీనా,సచిన్ ప్రతిమలు ఈ మ్యూజియంలో తళుకులీనుతున్నాయి.
ప్రపంచ ప్రముఖుల ప్రతిమలు: రాబర్ట్ విలిన్‌సన్, మోర్గాన్, లియొనార్డొ డికాప్రియో, నికోల్ కిడ్‌మన్, బ్రాడ్‌పిట్, ఎంజెలినజోలి, స్టిఫెన్ స్పీల్‌బర్గ్, జిమ్‌క్యారీ, జూలియో రాబర్ట్, జెనిఫర్ లోపెజ్, అర్నాల్డ్ స్కార్జ్‌నెగ్గర్, టైగర్‌వుడ్స్, మహ్మద్ అలీ, విలియమ్ షేక్స్‌పియర్, అల్బర్ట్ ఐనస్టీన్, స్టీఫెన్ హకింగ్, పాబిలో పికాసో, చార్లెస్ డార్విన్,మైఖెల్ జాక్సన్, లియనా లూయిస్, మడొన్నా, క్రిస్టియన అగలెర, రొలా విలియమ్స్, మార్గరెట్ థాచర్,టోనీ బ్లెయిర్, రోనాల్డ్‌రీగన్,విన్‌స్టన్ చర్చిల్, బేనజీర్‌భుట్టో, మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మాగాంధీ, మదర్‌థెరిస్సా.
No comments:
Post a Comment