ప్రకృతిలో భూమి కూడా ఓ అద్భుతాల సమాహారమే. కొండలు, గుట్టలు, నదులు, చెట్లు, తోటలు ఎన్నెన్నో. అన్నీ మనల్ని ఆకట్టుకొనేవే. ఉల్లాసపరిచి సేదతీర్చేవి. అందులో గుహలు ఎందరో సందర్శకుల్ని ఆకర్షిస్తుంటాయి. అటువంటి వాటిల్లో ఒకటి ఈ బెలుం గుహలు. ఆంధ్రప్రదేశ్‌లోగల కర్నూల్ జిల్లాకు చెందిన ఈ గుహలు భారత ఉపఖండంలోనే విస్తరణరీత్యా రెండో స్థానాన్ని ఆక్రమించాయి. దేశంలో అతిపెద్ద గుహలివి. కొలిమిగుండ్లకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలుం గ్రామంలో నెలకొంది.బిలం అనే సంస్కృత పదం నుంచి తెలుగులో బెలుం గుహలగా పేరు స్థిరపడింది.1884లోనే బ్రిటిష్ సర్వేయర్ రాబర్ట్ బ్రూస్‌ఫుట్ వీటిని తొలుత కనుగొన్నారు.అయితే 1982లో జర్మనీకి చెందిన డేనియల్ గెబర్ నేతృత్వంలోని గుహల పరిశోధన,అధ్యయన కర్తల బృందం బెలుంగుహల్ని గుర్తించి లోతైన పరిశోధనలు సాగించింది.
బెలుం గుహలు భళా: 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గుహలను పరిరక్షించి పర్యాటకక్షేత్రంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించింది.1999లో ఈ మేరకు పనులను ప్రారంభించి 2002 ఫిబ్రవరిలో ఈ బెలుంగుహల్ని జన సందర్శనకు సిద్ధం చేసింది.ఎపీటీడీసీ ద్వారా ఈ గుహలను అభివృద్ధి పరిచారు.ఈ గుహలు 3,229 మీటర్ల దూరం విస్తరించాయి. వీటి ప్రత్యేకత ఏమంటే అంతర్లీన గుహలివి. పైకి మైదానప్రాంతంగా పొలాలు,రహదారిగా కనిపిస్తుంది.ఈ గుహల ద్వారం వద్దకు వచ్చేవరకు ఇక్కడ ఇవి ఉన్నట్లే తెలీదు.3.5కిలోమీటర్ల గుహలో 1.5 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే జనాన్ని అనుమతిస్తారు.గుహల లోపల పొడవైన బాటలున్నాయి.వెడల్పైన పలు గదులు నెలకొన్నాయి.జాలువారే స్వచ్ఛమైన చిన్న జలసేలయేరు సందర్శకులకు భలే కనువిందు.భారత పురావస్తు పరిశోధన శాఖ(ఏఎస్ఐ)ఈ గుహల్లో క్రీస్తు పూర్వం 4500 నాటి పాత్రలను కనుగొంది.ఇందులో బౌద్ధ సన్యాసుల ధ్యానమందిరాన్ని వారు ఉపయోగించిన వస్తువులు తదితరాల్ని గుర్తించింది.గుహల లోపల 2కిలోమీటర్ల మేర నడకదారిని ఏపీటీడీసీ అభివృద్ధిపరిచింది.
చూడ బు(ద్ధి)ద్ధ:బెలుం గుహలకెళ్లే మార్గంలో ధ్యానముద్రలో ఉన్న నిలువెత్తు బుద్ధవిగ్రహం సందర్శకులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది.గుహల లోపల పలు వంతెనలు,మెట్ల వరుసలు అనేకం ఉన్నాయి.గాలి ఆడేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.కాల్షియం కార్బొనేట్‌తో రూపుదాల్చిన వేలకొద్దీ శివలింగాలు కోటిలింగాల ఛాంబర్ వద్ద అలరిస్తూ కనిపిస్తాయి.ఇక్కడ ప్రవహిస్తూ కనిపించే పాతాల గంగ(సెలయేరు)ఎటుపోతోందో మాత్రం మనకు అంతుచిక్కదు.ఈ గుహాలకు రెండు కిలోమీటర్ల దూరంలోగల ఓ బావిలోకి ఈ నీరు చేరుతోందట.2006 నుంచి సప్తస్వరాల(మ్యూజికల్ ఛాంబర్)సంగీతం ఈ గుహల్లో సందర్శకులకు వీనులవిందు కల్గిస్తోంది.ఇందులో గల ధ్యానమందిరం అచ్చం ఓ మంచం,దానిపై దిండు ఉన్న ఆకృతిలో చూపరులను ఆకట్టుకుంటోంది.బెలుంగుహల లోపల పైభాగాన్ని చూస్తుంటే వేలకొద్దీ పాములు పడగవిప్పినట్లు మనకు అనుభూతి కల్గుతుంది.ఇందులోని మర్రిచెట్టు హాల్‌ను తిలకిస్తే సంభ్రమాశ్చర్యాలు కల్గుతాయి.మండపం లోగిలి కూడా జనాన్ని చూపుమరల్చుకోనివ్వదు.బెంగుళూరు నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఈ బెలుం గుహలు 320 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. కర్నూల్ నుంచి ఇక్కడకు 106 కిలోమీటర్ల దూరం కాగా అనంతపురం నుంచి 85 కిలోమీటర్లు ఉంటుంది.తాడిపత్రి నుంచి బెలుంగుహలకు 30 కిలోమీటర్ల దూరం.అదే బనగానపల్లి నుంచయితే కేవలం 20కిలోమీటర్లే దూరం.
భారత్‌లో పేరొందిన గుహలు: అజంతా, ఎల్లోరా (మహారాష్ట్ర); ఎలిఫెంటా గుహలు (మహారాష్ట్ర); కన్హెరి గుహల (మహారాష్ట్ర).
ఆంధ్రప్రదేశ్‌లో బెలుం గుహలు(కర్నూల్);బొర్రా గుహలు(విశాఖపట్నం);గుత్తికొండ,యాగంటి,ఉండవల్లి గుహలూ(గుంటూరు) ప్రసిద్ధి చెందాయి.
వరల్డ్ ఫేమస్ టాప్-10 కేవ్స్
*ములు కేవ్స్(మలేసియా)
*జయిటగ్రొట్టో(లెబనాన్)
*కార్ల్స్ బడ్ కేవ్రన్స్(న్యూమెక్సికో-యు.ఎస్)
*స్కోజన్ కేవ్(స్లొవేనియా)
*మజ్లిస్ అల్‌జిన్(ఒమన్)
*వైటొమొ(న్యూజిలాండ్)
*ఫ్యూర్టోప్రిన్సెస్(ఫిలిప్పైన్స్)
*కేవ్ ఆఫ్ క్రిస్టల్స్(మెక్సికో)
*రీడ్‌ఫ్లూట్ కేవ్స్(చైనా)
*ఇజ్రిసెన్వెల్ట్(జర్మనీ)
No comments:
Post a Comment