(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)
అందానికే అందం..పక్షి జాతికే మకుటాయ మానం.. సైబీరియా పక్షులు . చాలా బలిష్టమైనవి కూడా. దాదాపు 4000 వేల మైళ్ల సుదూర తీరం నుంచి ఇవి వలసగా అలుపుసొలుపు లేకుండా ఎగురుకుంటూ రావడమే ఇందుకు ఉదాహరణ. సైబీరియా వాస్తవానికి రష్యాలో ఓ ప్రాంతం. యూరప్ ఖండమే అయినా ఉత్తర ఆసియా ఖండానికి సరిహద్దుల్లో ఉంది. సైబీరియా మొత్తం వైశాల్యం మొత్తం 10 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సుమారు 3 వేల మైళ్ల పర్వతశ్రేణులతో కూడిన ప్రాంతం. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత -68 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటుంది. ఈ అతిశీతల వాతావరణానికి దూరంగా వెచ్చని ప్రాంతంగా భారత్‌ను ఎంచుకొని ఈ పక్షులు ఇలా వలస వచ్చేస్తాయి. వీటి వలసకు ప్రధాన కారణాలు మూడు పునరుత్పత్తి, మంచి ఆహారం, నీరు, ఆహ్లాదకర (వెచ్చని) వాతావరణాన్ని ఆశించే సైబీరియా పక్షులు పెద్ద సంఖ్యలో వేల మైళ్లను లెక్కచేయకుండా వలస వస్తాయి. తెల్లనైన ఈ కొంగల రూపు బహు ఆకర్షణీయం. వీటి కళ్ల రంగు పసుపు.తల భాగం ఇరువైపుల ఇటుక రంగుతో ఉంటుంది. ముక్కు రంగు ఎరుపు కాగా కాళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులో ఆకర్షిస్తుంటాయి. చేపలు, కీటకాలే వీటి ఆహారం.
సైబీరియా నుంచి భారత్‌కు వలస వచ్చే క్రమంలో ఆప్ఘనిస్థాన్‌లోని అబ్-ఇ-ఎస్టడా సరస్సు ప్రాంతంలో సేద తీరి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. హిమాలయాల మార్గంలో ఇవి ప్రయాణిస్తుండగా పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇవి పెద్ద సంఖ్యలో వేటగాళ్ల బారిన పడుతున్నాయి. దాంతో మొత్తం ఈ జాతి పక్షుల ఉనికికే పెనుముప్పు పొంచి ఉంది. ఈ శీతాకాలంలో ఎక్కువ దూరం ఎగరడం ద్వారా తమ సామర్థ్యాన్ని పెంచుకోజూడ్డం కూడా వీటి ప్రాథమిక లక్షణంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సైబీరియా కొంగలకు వొల్ఫ్,స్నో క్రేన్లగాను పేరుంది. ఇవి దాదాపు 30 ఏళ్లు జీవిస్తాయట.ఇవి తొలుత రాజస్థాన్, పంజాబ్, హర్యానాల్లోనే దిగుతాయి.
భారత్‌లో టాప్-10 పక్షి సంరక్షణ కేంద్రాలు
ప్రపంచంలో మొత్తం 8650 పక్షి జాతులుండగా వాటిలో 1200 రకాలు భారత్‌లో ఉన్నాయి. భారత్ జాతీయ పక్షి
నెమలి కాగా ఇండియన్ ఈగిల్ (గరుడ) హిందువులకు ఆరాధ్య పక్షి జాతి. బస్టర్డ్, ఇండియన్ హార్న్‌బిల్,
కింగ్‌ఫిషర్స్ వంటి ఆకర్షణీయమైన పక్షులెన్నో దేశ,విదేశీ సందర్శకుల్ని అలరించే పదికిపైగా ప్రపంచ ప్రసిద్ధ పక్షి సంరక్షణ కేంద్రాలు భారత్‌లో ఉన్నాయి.
*భరత్‌పూర్ బర్డ్ సాంక్చురి: రాజస్థాన్‌లోగల దీనికే కియోలడియో ఘనా నేషనల్ పార్కుగా కూడా పేరు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కేంద్రమిది. థార్ ఎడారి సమీపంలో గల ఈ పార్క్‌లో పలు సరస్సులూ సందర్శకులకు
కనువిందు చేస్తాయి. ముఖ్యంగా ఇక్కడకు వచ్చే వేలకొద్దీ సైబీరియా కొంగలు, ఇతర విదేశీ వలస పక్షులు సందర్శకుల్ని, పక్షి ప్రేమికుల్ని ఆకట్టుకుంటుంటాయి.
*సుల్తాన్‌పూర్ బర్డ్ సాంక్చురి: 100 రకాల ప్రపంచ పక్షులు ఇక్కడకు వలస వస్తుంటాయి. హర్యానాలోని గుర్గాన్ జిల్లాలోని ఈ కేంద్రం వివిధ అటవీ జంతువులకు అనేక రకాల రంగుల్లోని వలస పక్షులకే పెద్ద వేదిక. పక్షుల కిలకిలా రావాలతో ఇక్కడకు వచ్చే సందర్శకులు మైమరచిపోతుంటారు.
* సలీం అలీ బర్డ్ సాంక్చురి: గోవాలో గల ఈ పక్షి సంరక్షణ కేంద్రం మందోని నదీ తీరంలోని చొరావ్ ఐలాండ్‌లో ఉంది. వివిధ రకాల పిచ్చుకలకు, అందాల చిలుకలకు, పిపొరల్ బర్డ్స్, పెలికాన్, ఇండియన్ జెయింట్ స్క్విరల్స్, ఫౌనాలకు పేరెన్నిక ఈ సాంక్చురి.
*కుమరకోమ్ బర్డ్ సాంక్చురి: కేరళలోని వెంబానద్ పక్షి సంరక్షణ క్షేత్రంగా కూడా పేరు. వెంబానద్ సరస్సు వల్లే ఈ కేంద్రానికి ఆ పేరు కూడా ఉంది. ఫ్లైకేచర్, టియల్ తదతర విదేశీ పక్షి జాతులకు ప్రసిద్ధి. ఈ రాష్ట్రంలోనే
మంగళవనం, తల్తెకద్ సంరక్షణ కేంద్రాలూ ఉన్నాయి.
*రంగంతట్టు బర్డ్ సాంక్చురి: కర్ణాటకలోని కావేరి తీరంలో కొలువుదీరింది. లైట్ ఇబిస్, ఈగ్రెట్, పార్ట్రిడ్జ్, హెరాన్, రివర్ తెర్న్, స్నేక్‌బర్డ్, స్టోన్ ఫ్లార్ తదితర ఎన్నో వలస పక్షులతో అలరారే కేంద్రమిది. ఈ కేంద్రం మైసూర్‌లోని ప్రసిద్ధ బృందావన్ గార్డెన్స్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
*వేదాంతగల్ బర్డ్ సాంక్చురి: తమిళనాడులోని ఈ సంరక్షణాలయంలోని పింటెయిల్, గార్గెని, గ్రే వాగ్టయిల్, బ్లూ వింగ్డ్ టియల్, కామన్ సాండ్ పైపెర్ పక్షులకు ప్రసిద్ధి చెందింది. తమిళనాడులో ఆరో వంతు అటవీ ప్రాంతమే దాంతో వివిధ పక్షి జాతులకు అనువుగా భాసిల్లుతోంది. ఈ కేంద్రంతో పాటు సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పులికాట్ సరస్సు తీరంలోను పలు వలస పక్షులు సందర్శకులకు కనువిందు కల్గిస్తుంటాయి.
*కౌండిన్య పక్షి సంరక్షణ కేంద్రం: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఎత్తైన కొండలు, లోతైన జలపాతాలు, కైగల్, కౌండిన్య అనే జలతరంగాలు ఈ కేంద్రానికే అదనపు ఆకర్షణ తెచ్చేవి. పలు దేశాల వలస పక్షులే కాక పలు అటవీ జంతువులతో సందర్శకులను అలరించే కేంద్రమిది. దీంతోపాటు కొల్లేరు సరస్సు కూడా సైబీరియా పక్షులు, ఇతర విదేశీ పక్షులకు కేంద్రంగా వర్థిల్లుతోంది.
*చిలక్ లేక్ బర్డ్ సాంక్చురి: ఒరిస్సాలోగల ఈ కేంద్రం సందర్శకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ సరస్సు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆసియాలోనే ప్రసిద్ధమైన పక్షిజాతులతో అలరారుతుంది. ముత్యపు ఆకారంలో గల చిలక్‌లేక్ ఓ అద్భుత అనుభూతి.
*మియాని బర్డ్ సాంక్చురి: మహారాష్ట్రలోని సతార్ జిల్లాలోగల ఈ కేంద్రం పలు విదేశీ పక్షి జాతులకు వేదిక. ఈ మార్గం గుండా పలు విదేశీ పక్షులు భారత్‌కు వలస వస్తుంటాయి. ఇక్కడ నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎగిరి వెళ్తుంటాయి. సైబీరియాకు చెందిన ఫ్లెమింగోస్ పెద్ద సంఖ్యలో ఇక్కడకు తరలి వస్తుండడం రివాజు.
*నల్సరోవర్ బర్డ్ సాంక్చురి: గుజరాత్‌లో గల అహ్మదాబాద్ లోగల ఈ కేంద్రం ఫ్లెమిగోస్, పెలికాన్స్, స్పూన్‌బిల్ప్, ఎవోసిట్స్, పిన్‌టైల్స్, స్మాల్ కార్మొరెంట్స్, స్మాల్‌గ్రేబ్స్, పోనలర్స్ పక్షులకు పేరొందిన కేంద్రం. ఈ రాష్ట్రంలోనే పోర్‌బందర్ బర్డ్ సాంక్చురి కూడా ఉంది. దేశంలోనే తొలి మెరైన్ నేషనల్ పార్కు ఇది.
No comments:
Post a Comment